అటవీశాఖ అధికారిణి అనిత కేసులో సుప్రీం జోక్యం

July 20, 2019


img

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని కొత్త సార్సాల గ్రామంలో జూన్ 29న హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీశాఖ అధికారులపై తెరాస నేత కోనేరు కృష్ణారావు నేతృత్వంలో గ్రామస్తులు కర్రలతో దాడి చేయడం, ఆ దాడిలో మహిళా అటవీశాఖ అధికారిణి అనితతో సహా సిబ్బంది గాయపడటం, సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో కృష్ణారావుపై తక్షణం వేటు వేసి దాడికి పాల్పడినవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం, మళ్ళీ గ్రామంలో ఒక మహిళ ఫిర్యాదు మేరకు అనితతో సహా అటవీశాఖ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అందరికీ తెలిసిందే. 

ఈ వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది పర్యావరణ సంబందిత సమస్య కాదని శాంతిభద్రతల సమస్య అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటవీశాఖ సిబ్బందిపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించవలసిందిగా తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె. జోషిని ఆదేశించింది. దేశంలో వివిద రాష్ట్రాలలో జరుగుతున ఇటువంటి సంఘటనలపై తామే స్వయంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ ఘటన జరిగిన మర్నాడే కేంద్రపర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ దాని గురించి పార్లమెంటులో ప్రస్తావించి, ఈవ్యవహారాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని చెప్పారు. అటవీశాఖ సిబ్బందిపై దాడులు చేసినందుకు కృష్ణారావుపై సిఎం కెసిఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోగా, ఆయనతో సహా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తుండగా ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేయడం ఆలోచింపజేస్తోంది.


Related Post