తెరాస నేతలు ఇబ్బంది పెడుతున్నారు: జగ్గారెడ్డి

July 12, 2019


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరాస సర్కారుపై పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఆయన సంగారెడ్డి పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, “పట్టణంలో ప్రజలు త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సింగూరు జలాలను తరలించుకుపోవడం వలననే నేడు పట్టణంలో ఇంత తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. సింగూరు జలాలను తరలించుకు పోకుండా నేను అడ్డుపడినప్పటికీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోయింది. ఇటువంటి ప్రజాసమస్యల గురించి నేను గట్టిగా మాట్లాడితే తెరాస నేతలు నా వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారి బెదిరింపులకు భయపడి నేను వెనక్కు తగ్గబోను. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ నీటిసమస్యను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలో త్రాగునీటి కష్టాలు తీరాలంటే పొరుగునే ఉన్న పటాన్ చెరు నుంచి నీటి సరఫరా చేయాలి. 

సంగారెడ్డిలో పీజీ కళాశాలను వేరే చోటికి తరలించడానికి ప్రభుత్వం సిద్దం అవుతోందని తెలిసింది. ఆ కళాశాలలో చదువుకొంటున్న వారిలో మహిళలే ఎక్కువమండి ఉన్నారు. కనుక కళాశాలను వేరే చోటికి తరలిస్తే వారందరూ తీవ్ర ఇబ్బందిపడతారు. పొరుగూరుకు వెళ్ళి చదువుకొనే ఆర్ధికస్థోమత లేనివారు డిగ్రీతోనే చదువులు మానుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక పీజీ కళాశాలను సంగారెడ్డి నుంచి తరలించవద్దని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 

రెండు రోజులలోగా పట్టణంలో త్రాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే సోమవారం నుంచి మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తాము. తెరాస ప్రజాప్రతినిధులు నాపై విమర్శలు చేయడం మానుకొని ముందుగా ఈ ప్రజాసమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని జగ్గారెడ్డి అన్నారు.


Related Post