తెరాస ఎంపీటీసీని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

July 10, 2019


img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో తెరాస ఎంపీటీసీ సభ్యుడు నలూరి శ్రీనివాసరావును మావోయిస్టులు సోమవారం రాత్రి ఆయన ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకుపోయి కిడ్నాప్ చేశారు. సుమారు 30 మంది మావోయిస్టులు కర్రలు, కత్తులు, విల్లంబులు, గొడళ్ళు పట్టుకొని సోమవారం రాత్రి 10 గంటలకు శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. నేరుగా ఇంటిలోకి ప్రవేశించి నిద్రిస్తున్న శ్రీనివాసరావును లేపి బలవంతంగా తమ వెంటపెట్టుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ వారిని ప్రతిఘటించడంతో మావోయిస్టులు వారిరువురినీ కర్రలతో చితకబాది వెంటతెచ్చుకున్న బైక్‌పై శ్రీనివాసరావును ఎక్కించుకొని తీసుకుపోయారు. వారు ఆయనను కిష్టారాంపాడు మీదుగా దండకారణ్యంలోకి తీసుకువెళ్ళినట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మావోయిస్టులు శ్రీనివాసరావును ఎందుకు కిడ్నాప్ చేశారో, ఇప్పుడు ఆయన ఎక్కడ ఎలా ఉన్నారో ఇంతవరకు తెలియలేదు. 


Related Post