కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలు

June 21, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును నేడు సిఎం కేసీఆర్‌ ప్రారంభించబోతున్నారు. సిఎం కేసీఆర్‌ ఉదయం 7.30 గంటలకు ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజికి చేరుకుంటారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 7.50 గంటలకు తాడేపల్లి నుంచి అక్కడకు చేరుకుంటారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాందేడ్ విమానాశ్రయం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకుంటారు. మహారాష్ట్ర గవర్నర్‌ సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. 

ఉదయం 8.30 నుంచి మేడిగడ్డ బ్యారేజి వద్ద హోమం జరుగుతుంది. దానిలో కేసీఆర్‌, జగన్, అతిధులు పాల్గొంటారు. హోమం పూర్తయిన తరువాత ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమక్షంలో సిఎం కేసీఆర్‌ ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత బ్యారేజిలో 5 గేట్లను ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత వారందరూ హెలికాప్టర్లలో  కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్దకు వెళ్ళి అక్కడ జరిగే యాగంలో పాల్గొని ఉదయం 11.40 గంటలకు మోటర్లను ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తారు. అనంతరం అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. ఆ తరువాత అక్కడే ముఖ్యఅతిధులందరికీ సిఎం కేసీఆర్‌ విందుభోజనం ఏర్పాటు చేశారు. భోజనంతరం అందరూ తిరుగు ప్రయాణం అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన కన్నెపల్లి రైతులకు కూడా ప్రభుత్వం పంప్‌హౌస్‌ వద్దే విందుభోజనం ఏర్పాటుచేస్తోంది.  

కన్నెపల్లి దిగువన గల అన్నారం బ్యారేజీని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ళ పంప్‌హౌస్‌ను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మారం మండలం నంది మేడారం వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభిస్తారు.


Related Post