జిల్లా పరిషత్ చైర్మన్లకు కేసీఆర్‌ మార్గదర్శనం

June 11, 2019


img

కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్-చైర్మన్లతో సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో సమావేశమయ్యి వారికి మార్గనిర్దేశనం చేశారు. కొత్తగా ఎన్నికైనవారు బాధ్యతలు చేపట్టడానికి జూలై వరకు సమయం ఉంది కనుక ఆలోగా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించే శిక్షణాకార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ చట్టం గురించి అవగాహన చేసుకొని, తదనుగుణంగా తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

రాష్ట్రంలో గ్రామాలన్నీ మళ్ళీ పచ్చగా, పరిశుభ్రంగా మారేందుకు ప్రతీ ఒక్కరూ దీక్షబూనాలని కేసీఆర్‌ అన్నారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిన జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రగతినిధి నుంచి రూ.10 కోట్లు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన వారు అధికారదర్పం ప్రదర్శించకుండా రాగల ఐదేళ్ళలో కష్టపడి పనిచేసి తమతమ గ్రామాలను చక్కగా అభివృద్ధి చేసి ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. రాష్ట్రంలో గంగదేవరపల్లి, ముల్కనూర్, అంకాపూర్‌ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలిచాయని, అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన అన్ని గ్రామాలు కూడా ఆదర్శంగా మారాలని, అందుకోసం ప్రతీ ఒక్కరూ చొరవ తీసుకొని పని చేయాలని సిఎం కేసీఆర్‌ కోరారు. 

వాస్తవానికి జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయివరకు సేవలందించేందుకు అనేకానేక చట్టాలు, వ్యవస్థలు, ఉద్యోగులు, ఎక్కడికక్కడ అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులు మనకున్నారు. స్థానిక వ్యవస్థలలో నిబద్దత ఉన్నట్లయితే గంగదేవరపల్లి, ముల్కనూర్, అంకాపూర్‌ గ్రామాల మాదిరిగా ఆదర్శ గ్రామాలుగా మారి ఉండేవి. కానీ చిరకాలంగా పాలకులలో ఇటువంటి నిబద్దత లోపించడం వలన దిగువస్థాయిలో అలసత్వం, అవినీతి పెరిగిపోయాయి. అందుకే నేడు మన గ్రామాలు సమస్యలతో విలవిలలాడుతున్నాయి. కనుక ఇకనైనా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ నియోజకవర్గాలను, వాటిలో గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేసుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు.


Related Post