ఆయన దగ్గరకే వెళ్ళండి: రేణుకా చౌదరి

May 24, 2019


img

ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసి తెరాస అభ్యర్ధి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి తన ఓటమిపై స్పందించారు. “ముందుగా ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి విజయం సాధించిన నామా నాగేశ్వరరావుగారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను జిల్లా ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా చేసి పెడుతున్నాను. కానీ వారు నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించారు కనుక ఇకపై అందరూ ఆయన వద్దకే వెళితే బాగుంటుంది. వారికి ఆయన డబ్బులు పంచి ఓట్లు కొనుకొన్నారు కనుక ఆయన వారికి నాలాగ సాయం చేస్తారో లేదో తెలియదు కానీ చేస్తారనే ఆశిస్తున్నాను. ఈసారి ఎన్నికలలో డబ్బు ప్రమేయం లేకుండా విజయం సాధించాలని నేను చేసిన ప్రయోగం విఫలం అయ్యింది. 

ఒకపక్క చాప క్రింద నీరులా బిజెపి నాలుగు జిల్లాలలో విస్తరించి బలపడుతుంటే దానిని గుర్తించలేకపోయిన సిఎం కేసీఆర్‌ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఏదో జరిగిపోతోందన్నట్లు స్వయంగా నియోజకవర్గం బాధ్యతలు తీసుకొని ఎన్నికల వ్యూహాలు అమలుచేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కనుక పోటీ నాకూ సిఎం కేసీఆర్‌కు మద్యే జరిగిందని దానిలో ఆయనే గెలిచారని భావిస్తున్నాను. ఎలాగైతేనేమీ నామా నాగేశ్వరరావు గెలిచారు కనుక ఇకనైనా జిల్లా అభివృద్ధికి కృషి చేయవలసిందిగా చేస్తున్నాను. గతంలో నేను జిల్లాలో ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది,” అని అన్నారు.


Related Post