కేసీఆర్‌ అబద్దాలు చెపుతున్నారు: దత్తన్న

May 20, 2019


img

సీనియర్ బిజెపి నేత బండారు దత్తాత్రేయ సిఎం కేసీఆర్‌ ఆరోపణలపి తీవ్రంగా స్పందించారు. రామగుండం ఎన్టీపీసీ పర్యటన సందర్భంగా సిఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ దీనికి శంఖుస్థాపన చేశారు కానీ నిర్మాణానికి ఒక్క రూపాయి విదిలించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నాము. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కూడా కేంద్రప్రభుత్వం చాలా కొట్లాడవలసి వచ్చింది,” అని అన్నారు. 

కేసీఆర్‌ చేసిన ఈ ఆరోపణలపై దత్తన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజనహామీలలో భాగంగానే రూ.1,500 కోట్ల వ్యయంతో రామగుండంలో ఎన్టీపీసీ ధర్మల్ విద్యుత్ ప్లాంట్ కేంద్రప్రభుత్వ నిధులతోనే నిర్మించబడుతుంటే దానికి కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని సిఎం కేసీఆర్‌ అబద్దం ఆడుతున్నారు. కేంద్రప్రభుత్వం నిధులతో నిర్మితమవుతున్న రామగుండం ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతుంటే, కేసీఆర్‌ మొదలుపెట్టిన యాదాద్రిలోని 4,000 మెగావాట్ల ప్రాజెక్టు, భద్రాద్రిలోని 1,080 మెగావాట్ల ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. అంటే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, కేసీఆర్‌కు ఎంత ఉందో అర్దం చేసుకోవచ్చు. గత ఎన్నికల తరువాత మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో రైతులకు సముచిత ధరలలో ఎరువులు అందజేయాలనే ఆలోచనతో తెలంగాణతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో మూతపడిన ఎరువుల కర్మాగారాల పునరుద్దరణకు భారీగా నిధులు అందించి తెరిపిస్తున్నారు. కానీ కేంద్రంతో కోట్లాడి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించుకొన్నానని కేసీఆర్‌ అబద్దం చెప్పడం దేనికో తెలియదు,” అని అన్నారు. 


Related Post