పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

April 22, 2019


img

తెలంగాణలో మూడు దశలలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో తొలిదశ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువడింది. మొదటిదశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కలిపి మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166  ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. కనుక నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. తొలి దశ ఎన్నికలకు ఏప్రిల్ 24వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25వ తేదీన వాటి పరిశీలించి 26న స్వీకరించిన, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. వాటిపై 26,27 తేదీలలో అప్పీలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. గడువు ముగిసిన తరువాత బరిలో మిగిలిన అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తారు. మే 6వ తేదీన మొదటిదశ ఎన్నికలు జరుగుతాయి. 

ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్ప ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస వరుస విజయాలు సాధిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాసలు గట్టిగా పోటీ పడ్డాయి. రెండు పార్టీలు తమకే అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని నమ్మకంగా ఉన్నాయి. కానీ మే 23న ఫలితాలు వెలువడేవరకు కాంగ్రెస్, తెరాస, బిజెపిలలో ప్రజలు దేనివైపు మొగ్గు చూపారో తెలియదు. లోక్‌సభ ఎన్నికలు జరిగి ఎక్కువ రోజులు కానందున వాటి ప్రభావం ప్రజలపై ఇంకా కొంత ఉంటుంది. ఒకవేళ ఆ ఎన్నికలలో ప్రజలు తెరాస వైపు మొగ్గు చూపి ఉంటే ఈ ఎన్నికలలో కూడా దానికే మొగ్గు చూపవచ్చు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాసల మద్య చీలి ఉండి ఉంటే ఈ ఎన్నికలలో కూడా అదే జరుగవచ్చు.


Related Post