రేవంత్‌ రెడ్డి అరెస్ట్

April 22, 2019


img

కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, సంపత్ కుమార్‌లను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి వద్దగల ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్ధులు, వారి తల్లి తండ్రులకు సంఘీభావంగా వారిరువురూ తమ అనుచరులతో కలిసి వచ్చి ధర్నాలో పాల్గొన్నప్పుడు పోలీసులు వారిరువురినీ అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారితోపాటు ఆందోళన చేస్తున్న ఏబివిపి కార్యకర్తలను, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. 

ఈసందర్భంగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్దుల జీవితాలతో ఆడుకొంటున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా అనేకమంది విద్యార్దులు పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. మూడు రోజులుగా విద్యార్దులు వారి తల్లితండ్రులు ఆందోళనలు చేస్తుంటే సిఎం కేసీఆర్‌ కనీసం స్పందించలేదు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీష్ రెడ్డి విఫలమయ్యారు. కనుక ఆయన తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ అవకతవకలకు కారకులైన ఇంటర్ బోర్డుఅధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇంటర్ బోర్డుఅధికారుల నిర్లక్ష్యం  కారణంగా పాస్ కావలసిన విద్యార్దులు ఫెయిల్ అయితే, పరీక్షా పత్రాల రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ కోసం విద్యార్దులు ఎందుకు ఫీజు చెల్లించాలి? ఇంటర్ బోర్డు విద్యార్దులందరికీ ఉచితంగా పరీక్షా పత్రాల రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేసి మళ్ళీ ఫలితాలు ప్రకటించాలి,” అని డిమాండ్ చేశారు. 

సోమవారం ఉదయం నుంచే విద్యార్దులు, వారి తల్లితండ్రులు నాంపల్లి వద్దగల ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయంలోకి వెళ్ళి అధికారులను కలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించకపోవడంతో అందరూ కలిసి గేటు బయట ఆందోళనలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజులలోగా అది విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. దాని ఆధారంగా తగిన నిర్ణయం, చర్యలు తీసుకోవాలని మంత్రి భావిస్తున్నారు.


Related Post