పదహారూ మనకే పక్కా: కేసీఆర్‌

April 15, 2019


img

సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం  జరిగింది. దీనిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు తగిన మార్గదర్శనం చేశారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన మనం లోక్‌సభ ఎన్నికలలో కూడా 16 సీట్లు గెలుచుకొని మరోసారి ఘనా విజయం సాధించబోతున్నామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఇదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా విజయం సాధించగలమని అందుకు పార్టీలో అందరూ కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని కేసీఆర్‌ సూచించారు. ప్రజలందరూ తెరాసవైపే ఉన్నారు కనుక 5,857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీలలో మెజార్టీ స్థానాలను, వాటితో పాటు 32 జెడ్పీ ఛైర్మన్ పదవులు గెలుచుకొనేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిల్లీలో మనమే చక్రం తిప్పబోతున్నామని కేసీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ రద్దు లేదా సమూలంగా ప్రక్షాళన చేయడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకొందామని కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


Related Post