ఈసారైనా కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా?

April 15, 2019


img

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అవి జరిగేలోపు ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోవడానికి సిద్దం అయ్యారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, వనమా వేంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ తెరాసలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కానీ లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైపోవడం, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తుండటంతో పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గురించి ఆలోచించే సమయం లభించలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు పూర్తయిపోవడంతో కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యి వారి చేత రాజీనామాలు చేయించేవరకు లేదా వారిపై అనర్హతవేటు పడేవరకు తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండాలని నిర్ణయించారు. అవసరమైతే దీని కోసం ప్రజలలోకి వెళ్ళి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ముందుగా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. స్పీకర్ వారిపై చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నామని, ఒకవేళ తీసుకోకపోతే తదుపరి కార్యాచరణకు సిద్దం అవుతామని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

గతంలో ఇదేవిధంగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో ఫిరాయించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెరాస ప్రభుత్వంతో రకరకాలుగా సుదీర్గపోరాటాలు చేసింది కానీ ఫలితం లేదు. కనుక ఈసారి కూడా కాంగ్రెస్‌ చేయబోయే ప్రయత్నాలు ఫలిస్తాయనుకోలేము. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని బిజెపి కూడా హెచ్చరిస్తోంది. అంటే అది కూడా కాంగ్రెస్‌ నేతలను ఆకర్షించబోతోందని అర్ధం అవుతోంది. కనుక మిగిలిన ఎమ్మెల్యేలనైనా చేజారి పోకుండా కాపాడుకోగలిగితే మంచిదేమో? 


Related Post