త్వరలో శాసనసభ సమావేశాలు?

April 15, 2019


img

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖను రద్దు చేయబోతున్నారనే బలమైన సంకేతాలు వెలువడుతున్న నేపధ్యంలో        సిఎం కేసీఆర్‌ ఆదివారం రాజ్ భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ నరసింహన్‌తో సుమారు 3 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి తన ఆలోచనలను ఆయనకు వివరించి ఆయన అభిప్రాయాలు, అనుమతి తీసుకొన్నాక ఆచరణలో పెట్టడం సిఎం కేసీఆర్‌కు అలవాటు. రెవెన్యూశాఖ రద్దు, పాలనా సంస్కరణలపై వారు లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలన్నిటిలో అవినీతిని అరికట్టేందుకు విజిలెన్స్ మరియు ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. వీటికి సంబందించి బిల్లులను రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టడానికి ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆదివారం రాత్రి సిఎం కేసీఆర్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైకోర్టులో నియామకాలు, సౌకర్యాలు మొదలైన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. 


Related Post