కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అవుట్

March 20, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజుకో ఎమ్మెల్యే చొప్పున తెరాసలోకి వెళ్ళిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవాళ్ళ కొల్లాపూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తాను పార్టీని వీడి తెరాసలో చేరబోతునంట్లు ప్రకటించారు. షరా మామూలుగా ఆయన కూడా తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నానని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరుతానని చెప్పారు.

మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తాజా సమాచారం. అదే కనుక జరిగితే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షపార్టీ హోదా కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శాసనమండలిలో ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితిలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఈ దుస్థితి ఏర్పడటంతో ఫిరాయింపులను ఏవిదంగా అపాలో తెలియక కాంగ్రెస్‌ నేతలు తలలు పట్టుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం సబితా ఇంద్రారెడ్డి, నిన్న డికె అరుణ వంటి సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడి వెళ్ళిపోతుండటంతో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో విజయం సాధిస్తే తప్ప కోలుకోవడం కష్టమే.


Related Post