డికె అరుణ కూడా జంప్

March 20, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డికె అరుణ కూడా పార్టీకి ‘రామ్...రామ్’ చెప్పి బిజెపిలో చేరిపోయారు. మంగళవారం ఉదయం బిజెపి సీనియర్ నేత రాంమాధవ్ ఆమె నివాసానికి వెళ్ళి ఆమెతో భేటీ అయ్యారు. ఆమె మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయదలిస్తే టికెట్ కేటాయించేందుకు బిజెపి సిద్దంగా ఉందని తెలిపినట్లు సమాచారం. అనంతరం డిల్లీ నుంచి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడి డిల్లీ రావలసిందిగా ఆహ్వానించడంతో వెంటనే ఆమె నిన్న రాత్రి డిల్లీ వెళ్ళి బిజెపిలో చేరిపోయారు. 

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ నేతల మద్య లుకలుకల కారణంగా జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డికె అరుణను ఓడించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తెరాస గట్టి దెబ్బ తీసింది. మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో మరోసారి చావుదెబ్బ కొట్టడానికి సిద్దం అవుతోంది. నిజానికి డికె అరుణ మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకొన్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆ స్థానాన్ని వంశీ చంద్ రెడ్డికి కేటాయించింది. దీంతో ఆమె అసంతృప్తికి లోనవడం సహజమే కనుక అటువంటి బలమైన అభ్యర్ధుల కోసం గాలిస్తున్న బిజెపి నేత రాంమాధవ్ ఆమెను ఒప్పించి డిల్లీకి తీసుకువెళ్లగలిగారు. కనుక ఆమె బిజెపిలో చేరడం, మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయడం ఖాయమనే భావించవచ్చు. ఇటువంటి కీలకమైన సమయంలో డికె అరుణ బిజెపిలోకి వెళ్లిపోతే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టమే. ఒకవైపు తెరాస, మరోవైపు సొంత మనిషి డికె అరుణతోనే కాంగ్రెస్ పార్టీ పోరాడవలసి ఉంటుంది. 


Related Post