సికిందరాబాద్‌ నుంచి జనసేన పోటీ

March 18, 2019


img

ఏప్రిల్ 11న జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో సికిందరాబాద్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా నేమూరి శంకర్ గౌడ్ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదివారం అర్ధరాత్రి ప్రకటించారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి బి. మహేందర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో 32 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు కూడా పవన్‌కల్యాణ్‌ నిన్న రాత్రి అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ ఏపీలో మొత్తం 64 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. జనసేన పార్టీ ఈసారి ఎన్నికలలో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులు పెట్టుకొని వాటికి కూడా సీట్లు కేటాయించింది. సిపిఐ, సిపిఎం పార్టీలకు చెరో రెండు లోక్‌సభ, చెరో 7 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. అలాగే బిస్పీకి 3 లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లు కేటాయించారు.

గత ఎన్నికలలో టిడిపి-బిజెపిలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌  ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొన్నారని అభ్యర్ధుల జాబితాల విడుదల, బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో అన్ని స్థానాలలో జనసేన పార్టీ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టకుండా మిత్రపక్షాలకు భారీగా సీట్లు కేటాయించడం ద్వారా చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు. బలం లేని చోట పోటీ చేసి ఓడిపోవడం కంటే ఆ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తే రిస్క్ తగ్గించుకోవడమే కాకుండా, వాటికున్న బలంతో అవి కూడా గెలిస్తే రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆ పార్టీలతో పొత్తుల కారణంగా వాటిని అభిమానించేవారి ఓట్లు కూడా జనసేనకు పడే అవకాశం ఉంది. పైగా ఈ పొత్తుల కారణంగా జాతీయస్థాయి నేతలతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కనుక ఈసారి పవన్‌కల్యాణ్‌ చాలా ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నారనే చెప్పవచ్చు. 



Related Post