పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజీనామా

February 08, 2019


img

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవుల నియామకంలో తనను పక్కన పెట్టినందుకు పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు పీసీసీ ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను శుక్రవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా తనను కాదని ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావును నియమించడంపై రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

పార్టీలో కష్టపడేవారికి, ఆదివాసీలకు, గిరిజనులకు ఎప్పుడూ న్యాయం జరగలేదని రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారేవారికి, కొత్తగా పార్టీలో చేరినవారికే ప్రాధాన్యం లభిస్తోందని అన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే తనకు డిసిసి పదవి ఇస్తున్నట్లు ప్రకటించి మళ్ళీ ఆఖరు నిమిషంలో ఇవ్వలేకపోతున్నామని తెలిపారని, ఈసారి అవకాశం ఉన్నప్పటికీ తనకు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేగా కాంతారావు తెరాసలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వాటికి బలం చేకూరుస్తున్నట్లుంది. 


Related Post