సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ రాజీనామా

January 11, 2019


img

సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాకు ఆయనకు మద్య వివాదాలు ముదరడంతో వారిరువురినీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించగా అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషనువేసి మళ్ళీ తన పదవిని పొందారు. రెండు రోజుల క్రితమే ఆయన మళ్ళీ సిబిఐ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆదేరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్ఘేలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమయ్యి ఆయనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన తరువాత ఆయననుఫైర్ సర్వీసస్, సివిల్ డిఫెన్స్ మరియు హోమ్ గార్డ్స్ సంస్థకు డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. అయితే, మల్లికార్జున ఖర్ఘే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆయనను బదిలీ చేసి ఆయన స్థానంలో మళ్ళీ నాగేశ్వరరావును సిబిఐ తాత్కాలిక డైరెక్టరుగా ప్రభుత్వం నియమించింది. ఈ అవమానాన్ని భరించలేక అలోక్ వర్మ నేడు తన పదవికి రాజీనామా చేశారు. 

తన బదిలీపై స్పందిస్తూ, “నేను మా సంస్థ విలువలను, గౌరవాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేశాను. నేను ఉన్నతస్థాయిలో ఉన్నవారి అవినీతిపై దర్యాప్తు చేయిస్తున్న కారణంగానే ప్రభుత్వం నాపట్ల ఈవిధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కనీసం సహజన్యాయం కూడా పాటించకుండా నన్ను పదవిలో నుంచి బలవంతంగా తొలగిస్తే నేను న్యాయపోరాటం చేసి మళ్ళీ నా పదవిని పొందాను. కానీ మళ్ళీ నన్ను అకారణంగా బదిలీ చేశారు. దీనిని సహించలేకనే నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post