పంచాయతీ ఎన్నికలలో కొత్త అధ్యాయం

January 11, 2019


img

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. గతంలో పంచాయతీ ఎన్నికలంటే గొడవలు, కొట్లాటలు సర్వసాధారణమైన విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో చాలా గ్రామాలలో ప్రజలందరూ ఏకాభిప్రాయంతో పోటీ లేకుండా ఎన్నుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షలు, స్థానిక ఎమ్మెల్యేలు మరో రూ.5 లక్షలు బహుమానంగా ప్రకటిస్తుండటమే అందుకు కారణం. అదీగాక ఏకగ్రీవ పంచాయతీలలో అభివృద్ధి పనులకు మొదటి సంవత్సరంలో సుమారు రూ.50 లక్షల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కనుక గ్రామస్తులు ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్తగా పంచాయతీలుగా మారిన తండాలలో ప్రజలు ఏకగ్రీవానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

మొదటిసారిగా ఏర్పడుతున్న పంచాయతీలను కలిసికట్టుగా ఏర్పాటుచేసుకొని మంచిపేరు, గుర్తింపు వాటితో ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సంపాదించుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఒకరి కంటే ఎక్కువమంది పోటీ పడుతున్నట్లయితే కొన్ని చోట్ల వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటే మరికొన్ని గ్రామాలలో అభ్యర్ధులను మీలో మీరే మాట్లాడుకొని ఎవరో ఒకరే ముందుకు రావలనే షరతు విధిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిదశలో పంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లలో ఇప్పటి వరకు 360 గ్రామాలు ఏకగ్రీవం అయినట్లు సమాచారం. ఎల్లుండి అంటే ఆదివారం సాయంత్రం ఎన్నికల అధికారులు అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తారు కనుక ఆ రోజున ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవుతాయో తెలుస్తుంది. ఒకవేళ ఈసారి ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరిగినట్లయితే పంచాయతీ ఎన్నికలలో ఇది ఒక నూతన అధ్యాయంగానే నిలుస్తుంది.


Related Post