ఏపీకి తదుపరి ముఖ్యమంత్రిని నేనే: కెఏ పాల్

January 11, 2019


img

సినిమాలలో కామెడీ ట్రాక్ ఉన్నట్లే రాజకీయాలలో కూడా ఒక్కోసారి కామెడీ ట్రాక్ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం నిప్పులా రగులుతున్న ఏపీ రాజకీయాలలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ మంచి కామెడీ పండిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఆయన ఖరారు చేశారు. ఆయన నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “నేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తతదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నాయను. నేను ముఖ్యమంత్రి కాబోతున్నాననే సంగతి గ్రహించిన చంద్రబాబునాయుడు భయంతో నన్ను రాష్ట్రంలో తిరగనీయకుండా అడ్డుపడుతున్నారు. కానీ ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా నేనే ఏపీకి ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు కావాలనుకుంటే నాకు సలహాదారుగా పనిచేయవచ్చు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆ కల ఎన్నటికీ నెరవేరే అవకాశం లేదు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం. 

చంద్రబాబునాయుడు-ప్రధాని నరేంద్రమోడీ పైకి ఘర్షణపడుతున్నట్లు నటిస్తున్నా వారిద్దరూ శాశ్వితమిత్రులే. ఇప్పుడు వారికి జగన్ కూడా తోడయ్యారు. కనుక వారిలో ఎవరికి ఓటేసినా నరేంద్రమోడీకి ఓటేసినట్లే. నేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేస్తాను. మా అధ్వర్యంలో 18 ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏర్పాటవుతున్న థర్డ్‌ ఫ్రంట్‌కు 300 ఎంపీ సీట్లు వస్తాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓటమి ఖాయం. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాలేరు. నేను మాత్రమే మోడీకి ఏకైక ప్రత్యామ్నాయం. అనేక సర్వేలు ఈ విషయాలను నిర్ధారించాయి,” అని కెఏ పాల్ చెప్పారు.


Related Post