4,480 పంచాయతీలకు నామినేషన్ల గడువు పూర్తి

January 10, 2019


img

మూడు దశలలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలలో మొదటి దశలో4,480 పంచాయతీలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. 4,480 పంచాయతీలలో గల 39,832 వార్డులకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన తరువాత ఈరోజు సాయంత్రం వాటిలో అర్హమైనవాటిని ప్రకటిస్తారు. తిరస్కరించబడిన నామినేషన్లపై రేపు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వతేదీ వరకు గడువు ఉంది. 

ఒకవేళ సర్పంచ్ పదవులకు పోటీ లేనట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలను ఈరోజు సాయంత్రమే అధికారికంగా ప్రకటిస్తారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని రాత్యా తందాకు చెందిన కన్నీలాల్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి. 

వేలంపాట ద్వారా పంచాయతీలను దక్కించుకున్నవారిపై కటినచర్యలు తీసుకొంటామని ఎన్నికల కమీషనర్ హెచ్చరించినప్పటికీ, జిల్లాలోని గుర్రంపోడు సర్పంచ్‌ పదవిని రూ. 63.30 లక్షలకు, చామలేడు గ్రామ సర్పంచ్‌ పదవిని రూ.16.50 లక్షలకు, మైలాపురంలో రూ.16.50 లక్షలకు, తేనెపల్లిలో రూ.8లక్షలకు వేలంద్వారా దక్కించుకున్నారు. అదేవిధంగా వివిద జిల్లాలలో కూడా ఇటువంటి వేలంపాటలు జోరుగా సాగుతుండటం విశేషం. కేవలం 34 మంది ఓటర్లు మాత్రమే ఉన్న అతి చిన్న పంచాయతీ దొంగతోగులో ఏకగ్రీవం అయ్యింది. స్థానిక మహిళ బాయమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


Related Post