కొడంగల్‌లో ఎవరు గెలుస్తారు?

December 10, 2018


img

ఈసారి ఎన్నికలలో కొడంగల్‌ నియోజకవర్గంపై తెరాస ప్రత్యేక శ్రద్ద పెట్టింది. కారణాలు అందరికీ తెలిసినవే. రేవంత్‌రెడ్డి గత నాలుగున్నరేళ్ళుగా సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ తెరాసకు కొరకరాని కొయ్యగా మారడమే కాకుండా రాజకీయంగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. కనుక ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో రేవంత్‌రెడ్డిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని తెరాస చాలా గట్టిగా ప్రయత్నించింది. 

కానీ రేవంత్‌రెడ్డి కూడా ఎన్నిఆటుపోటులు ఎదుర్కోవలసివచ్చినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నిబ్బరంగా తెరాసను దాని అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొని గట్టిగా పోరాడారు. కనుక కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డిలలో ఎవరు గెలుస్తారనే కాకుండా ఎంత మెజారిటీతో గెలుస్తారనే చర్చలు, బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. 

ముందుగా పట్నం నరేందర్ రెడ్డి గెలుపు గురించి చెప్పుకోదలిస్తే, నిజానికి ఇది ఆయనకు రేవంత్‌రెడ్డికి మద్య జరిగిన పోటీగా కొడంగల్‌లో ఎవరూ భావించడం లేదు....కేసీఆర్‌- రేవంత్‌రెడ్డికి మద్య జరిగిన పోటీగా అందరూ చూస్తున్నారు. కనుక తెరాస అదే స్థాయిలో అక్కడ ఎన్నికల ప్రచారం, ‘తదితర ఏర్పాట్లు’ చేసిందని చెప్పవచ్చు. కనుక ఈసారి తెరాస నుంచి రేవంత్‌రెడ్డి చాలా గట్టి పోటీయే ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పవచ్చు. కానీ తెరాస అభ్యర్ధి రేవంత్‌రెడ్డికి రాజకీయంగా సమ ఉజ్జీ కాదనే చెప్పవచ్చు.  కనుక తెరాస చేసిన ‘ఇతర ప్రయత్నాలు’ ఫలిస్తే తప్ప ఆయన విజయం సాధించడం కష్టమేనని చెప్పవచ్చు. 

ఇక రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే ఆయనకు కొడంగల్‌ కంచుకోటవంటిదని అందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారం ముగిసే ముందురోజు ఆయనను అకారణంగా అర్దరాత్రి అరెస్ట్ చేయడం, అప్పుడు ఆయన భార్య ప్రజల మద్యకు వెళ్ళి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని ఓట్లువేయమని అడగటం వంటి నాటకీయపరిణామాలన్నీ కొడంగల్‌ ప్రజలలో రేవంత్‌రెడ్డి పట్ల సానుభూతి పెరిగేందుకు దోహదపడతాయని వేరే చెప్పనవసరం లేదు. 

ఇక రేవంత్‌రెడ్డి అరెస్టు వ్యవహారంపై హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దాంతో జిల్లా ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేయడం  వంటి పరిణామాలన్నీ రేవంత్‌రెడ్డి పట్ల తెరాస కక్షపూరితంగా వ్యవహరించిందని దృవీకరించినట్లయింది. ఇది కూడా రేవంత్‌రెడ్డికి కలిసి వచ్చే అంశమేనని భావించవచ్చు. 

చివరాఖరుగా తప్పకుండా చెప్పుకోవలసిన విషయం ప్రజాకూటమి అధ్వర్యంలో కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగసభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రప్పించడం. తద్వారా తనకు కాంగ్రెస్ పార్టీలో ఎంత పలుకుబడి ఉందో రేవంత్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చాటి చెప్పగలిగారు. తద్వారా తనను గెలిపిస్తే కొడంగల్‌ అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజలలో కలిగించగలిగారు. 

కనుక ఈ అన్ని కారణల వలన రేవంత్‌రెడ్డి గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ తెరాస నుంచి గట్టి పోటీ ఎదురైనందున భారీ మెజార్టీ రాకపోవచ్చు.


Related Post