అక్కడ మోడీ...ఇక్కడ కేసీఆర్‌: రాహుల్ విమర్శలు

October 20, 2018


img

శనివారం కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ సిఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీలపై తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలు పేరిట అవినీతికి పాల్పడుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పడంలో, అవినీతిలో ఇద్దరూ ఇద్దరేనని రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుతారని అనుకొని కేసీఆర్‌కు ప్రజలు అధికారం అప్పజెప్పితే ఆయన రాష్ట్రంలో నిరంకుశ, కుటుంబపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లు ఖర్చుపెట్టి తనకోసం విలాసవంతమైన ప్రగతిభవన్‌ కట్టించుకొన్నారు కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వలేకపోయారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేకపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలుచేయకుండా సిఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే లక్ష ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి ఇస్తామని, ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ సభా ముఖంగా హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఏ ఆకాంక్షలతో తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రజలు పోరాడారో, వాటిని నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలకు విజ్నప్తి చేశారు.


Related Post