విమానంలో నుంచి ఎయిర్ హోస్టస్ క్రింద పడింది!

October 17, 2018


img

అవును.  విమానంలో నుంచి  ఎయిర్ హోస్టస్ క్రింద పడటమేమిటి అని ఆశ్చర్యపోవద్దు. మీరు విన్నది నిజమే. ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున 6.10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

విమానంలోకి ప్రయాణికులు ప్రవేశించడానికి విమానాన్ని ఎయిరో బ్రిడ్జితో అనుసంధానం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే విమానాశ్రయంలో విమానం ఆగి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడేందుకు వీలుగా విమానానికి వెనుకవైపు ఉన్న రెండు తలుపులను తెరిచి వాటిని మెట్లు కలిగిన వాహనంతో అనుసంధానం చేసి ఉంచుతారు. 

ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా నిలిపి ఎయిరో బ్రిడ్జితో అనుసంధానం చేస్తునప్పుడు, నిబందనల ప్రకారం ఎయిర్ హోస్టస్ హర్ష లోబో (53) విమానం వెనుక తలుపును తెరిచారు. ఆ తరువాత దానికి మెట్లు కలిగిన వాహనంతో అనుసంధానం చేసారు. ప్రయాణికులు అందరూ ఎక్కిన తరువాత విమానం తలుపును మూసేటప్పుడు ఆమె పొరపాటున మెట్లకు తలుపుకు మద్య ఉన్న కొంత ఖాళీ ప్రదేశంలో కాలు పెట్టడంతో క్రింద పడిపోయారు. విమానం ద్వారం నేలపై నుంచి సుమారు 17-20 అడుగుల ఎత్తులో ఉంటుంది. కనుక ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది ఆమెను తక్షణం నానావతీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంలో ఆమెకు రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. కాలి మడమలు కూడా దెబ్బ తిన్నాయి. వెన్నుపూసకు ఛాతికి బలమైన గాయాలయ్యాయి. ఆమెకు అవసరమైన శస్త్ర చికిత్సలు చేశామని, ప్రస్తుతం ఆమె మెల్లగా కొలుకొంటున్నారని ఆమెకు చికిత్స చేస్తున్న ఆర్ధోపెడిక్ వైద్యులు డాక్టర్ పిఎం దోషి చెప్పారు.


Related Post