తెరాస మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది: ఉత్తమ్

October 17, 2018


img

సిఎం కేసీఆర్‌ నిన్న తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “మేము గత ఏడాదిగా ప్రకటిస్తూ వచ్చిన హామీలను అన్నిటినీ సిఎం కేసీఆర్‌ కాపీ కొట్టి తెరాస మేనిఫెస్టోలో పెట్టుకొన్నారు. ఆయన చెప్పిన పంటరుణాల మాఫీ, నిరుద్యోగభృతి, పించన్లు మొదలైన హామీలన్నీ మేము ప్రకటించినవే కదా! వాటిని మేము ప్రకటించినప్పుడు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ అంతా కేటాయించినా సరిపోదని ఎద్దేవా చేసిన కేసీఆర్‌ ఇప్పుడు అవే హామీలను ఎందుకు ప్రకటించారు? వాటిని ఏవిధంగా అమలుచేస్తారు?

ఈసారి ఎన్నికలలో తెరాస ఓడిపోతుందనే భయంతోనే ఇప్పుడు కెసిఆర్ కూడా ఒకేసారి పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నారు. గత నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీ చేయకుండా కాలక్షేపం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు తాపీగా తెలంగాణలో సుమారు 13 లక్షల మండి నిరుద్యోగులు ఉన్నారని చెప్పడం సిగ్గుచేటు. ఇది ఆయన ప్రభుత్వ  వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం. మేము నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని ప్రకటించినప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేసిన కేసీఆర్‌, ఇప్పుడు తమ పార్టీ కూడా ఇస్తుందని చెప్పడం సిగ్గుచేటు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌, ఇంతవరకు ఎన్ని ఇళ్ళు నిర్మించి ఇచ్చారో చెప్పలేరు కానీ మళ్ళీ పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నారిప్పుడు. సిఎం కేసీఆర్‌ చేతిలో ఒకసారి మోసపోయిన ప్రజలు మళ్ళీ ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్నప్తి చేస్తున్నాము. ఈసారి ఎన్నికలలో తెరాస ఓడిపోవడం ఖాయమనే భయంతోనే సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని అర్ధమవుతోంది. తద్వారా కాంగ్రెస్‌ విజయం తధ్యమని సిఎం కేసీఆర్‌ స్వయంగా అంగీకరించినట్లే చెప్పవచ్చు. తెరాస మేనిఫెస్టోను చూసిన తరువాత తండ్రీకోడుకులు ఇద్దరూ ఇంతకాలం మాపార్టీపై చేస్తున్న విమర్శలు తప్పని స్పష్టం అయ్యింది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


Related Post