జీవన్ రెడ్డి అవినీతి భాగోతం ఇదే: కవిత

October 12, 2018


img

జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణలకు తెరాస ఎంపీ కవిత నిన్న కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. జగిత్యాలలో తెరాస ప్రచారం సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ వారిరువురిపై తీవ్ర విమర్శలు చేశారు.

 “కుంభమేళాలో విడిపోయి మళ్ళీ ఎప్పుడో కలుసుకొన్నట్లుగా రెండు భిన్నమైన పార్టీలకు చెందిన వారిరువురూ ఒకే వేదికపై కలుసుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసమే కలిశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒకరేమో డిల్లీకి గులాము... మరొకరేమో అమరావతికి గులాము. వారిరువురూ కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఏవిధంగా కాపాడగలరు? అయినా పరాయి పాలన వద్దని, స్వయంపాలన చేసుకోవాలనే కదా తెలంగాణ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకొన్నాము? ఇప్పుడు మహా కూటమికి ఓటేస్తే వారు రాష్ట్రాన్ని డిల్లీకి, అమరావతికి తాకట్టు పెట్టకుండా ఉంటారా? చంద్రబాబు నాయుడుకి భయపడి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనడానికి భయపడిన ఎల్ రమణ, తన స్వార్ధం కోసం జగిత్యాలకు అన్యాయం చేసిన జీవన్ రెడ్డికి అసలు ప్రజలను ఓటు అడిగే హక్కే లేదు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జగిత్యాలలో తమ కుటుంబానికి భూములు ఉన్న చోట ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేయించుకొన్న మాట వాస్తవమా కాదా?నాచుపల్లి వద్ద మీ భూముల విలువ పెంచుకోవడం కోసమే అక్కడ      జేఎన్‌టీయూ కాలేజీ  నిర్మించింది వాస్తవం కాదా? 2009, 2014 ఎన్నికల అఫిడవిట్ లో మీ ఆస్తుల విలువలను తప్పుగా చూపిన మాట వాస్తవమా కాదా?”అని కవిత జీవన్ రెడ్డికి ప్రశ్నలు సందించారు. 

 ఇటువంటి స్వార్ద కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేసి రాష్ట్రాన్ని మళ్ళీ పరాయి పాలన తీసుకు రావద్దని, తెలంగాణ అభివృద్ధి కోసం తెరాసకే ఓటు వేసి గెలిపించాలని కవిత జగిత్యాల ప్రజలను కోరారు.


Related Post