కోదండరాంకు హరీష్ రావు చురకలు

September 20, 2018


img

మంత్రి హరీష్ రావు బుధవారం సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరాంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణా ఉద్యమ సమయంలో కెసిఆర్‌ తెలంగాణాలో ప్రజలందరినీ కూడగడుతున్నప్పుడు కోదండరాంకు కూడా ఉద్యమ బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు రాష్ట్రంలో ఒక గుర్తింపు ఏర్పడింది. అదంతా తన గొప్పదనమేనని భావిస్తూ ఆయన పార్టీ పెట్టారు. నిజంగా ఆయనకు అంతా బలం ఉందని గట్టిగా నమ్ముతున్నట్లయితే, ఆయన ఇదివరకు చెప్పుకొన్నట్లుగా ఒంటరిగానే పోటీ చేయవచ్చు కదా? రెండు మూడు టికెట్ల కోసం గాంధీ భవన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అంటే ఇంతకాలం ఆయన వాపును చూసి బలుపు అనుకొన్నారు. కానీ ఇప్పటికే ఆయనకు తన పరిస్థితి అర్ధం అయ్యింది కనుకనే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులకు సిద్దమయ్యారు. వందలాది తెలంగాణా బిడ్డల చావుకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకపక్క రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకొంటున్నఅది వెళ్ళి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొంటున్న టిడిపితో నిసిగ్గుగా పొత్తులు పెట్టుకొంటే, ఆ తెలంగాణా వ్యతిరేకపార్టీలతో కోదండరాం చేతులు కలపడం సిగ్గు చేటు. రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా టిఆర్ఎస్‌ను ఓడించడం సాధ్యం కాదని వారు గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.


Related Post