అదేంటి...అధికారపార్టీ నేత ఇంటిపై ఐటి దాడులు?

September 18, 2018


img

ఖమ్మం ఎంపీ, టిఆర్ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, హైదరాబాద్‌లోని కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాఘవ ఇన్ఫ్రా కార్యాలయంతో పాటు మొత్తం 12 చోట్ల, ఖమ్మంలో 6 చోట్ల, కల్లూరు మండలంలోని ఆయన స్వగ్రామం  నారాయణపురంలోగల రాఘవ నిలయంపై అన్ని చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు రాత్రి వరకు తనికీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.    

కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి తన ఇంటిపై త్వరలోనే ఐటి లేదా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిన్ననే ప్రకటించారు. కానీ ఆదాయపన్ను శాఖ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటిపై కాకుండా అధికార పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాస్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన ఇంటిపై కేంద్ర సంస్థలు దాడులు చేసి, తనను అరెస్ట్ చేయవచ్చని రేవంత్ రెడ్డి ముందే ప్రకటించినందున, ఆదాయపన్ను శాఖ అధికారులు తమకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదని చాటిచెప్పేందుకే పొంగులేటి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారేమో. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే పొంగులేటి తరువాత రేవంత్ రెడ్డి వంతు వస్తుందేమో?


Related Post