ఇక శలవు

August 16, 2018


img

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (93) గురువారం సాయంత్రం 5 గంటలకు డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన గత తొమ్మిది సం.లుగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 11వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈరోజు కన్నుమూశారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం తెరిచిన పుస్తకం వంటిది. ఆయన డిసెంబర్ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు. కనుక స్వాతంత్ర్య సమరంలో పాల్గొనే అదృష్టం కూడా దక్కింది. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీని వ్యతిరేకించి మళ్ళీ కొంతకాలం జైలు జీవితం గడిపారు. 1980లో లాల్ కృష్ణ అద్వానీతో కలిసి భారతీయ జనతా పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి వారిద్దరూ కృష్ణార్జునులవలె పార్టీని నడిపించారు.

పార్టీని స్థాపించిన తరువాత ఆరేళ్ళపాటు వాజ్‌పేయీ బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేశారు. 1996లో బిజెపి ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన మొదటిసారిగా ప్రధానమంత్రి పదవి చేపట్టారు. కానీ ప్రభుత్వ మనుగడకు అవసరమైన మద్దతు కూడగట్టడానికి అడ్డుదారులు త్రొక్కడం ఇష్టపడని ఆయన 13 రోజుల తరువాత తన పదవికి రాజీనామా చేశారు. 

మళ్ళీ 1998లో ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలలో ఘనవిజయం సాధించి మళ్ళీ రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. కానీ మొదటిసారి 13 రోజులలో ప్రభుత్వం కూలిపోతే, రెండవసారి సరిగ్గా 13 నెలల తరువాత వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోవడం విశేషం. జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 1999 ఏప్రిల్ 17న ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు కేవలం ఒకే ఒక ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అటువంటి సందర్భాలలో చాలా సులువుగా ఇతర పార్టీల మద్దతు పొందే అవకాశం ఉన్నప్పటికీ వాజ్‌పేయీ నైతికవిలువలకే ప్రాధాన్యం ఇచ్చి హుందాగా తన పదవికి రాజీనామా చేశారు.

మళ్ళీ 1999లో బిజెపి నేతృత్వంలో ఎన్డీయే కూటమి 303 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీ సాధించడంతో వాజ్‌పేయీ మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అప్పుడు మాత్రం పూర్తిగా ఐదేళ్లు ప్రధానిగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటంతో 2005లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. 2009 నుంచి ఆయన ఆరోగ్యపరిస్థితి క్రమంగా క్షీణించసాగింది. తొమ్మిదివారాలపాటు ఎయిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పొరాడి చివరికి ఈరోజు తుదిశ్వాస విడిచారు. 


Related Post