తెలంగాణాలో కాంగ్రెస్‌కు అభ్యర్ధులే లేరు: లక్ష్మణ్

August 14, 2018


img

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. అది చచ్చేదే. అసలు ఎన్నికలలో నిలబెట్టడానికి ఆ పార్టీలో అభ్యర్ధులే లేరు. రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలు గురించి రాహుల్ గాంధీ అబద్దపు ఆరోపణలు చేస్తూ కేంద్రప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. 40 ఏళ్ళ కాంగ్రెస్‌ పాలన, నాలుగేళ్ల మోడీ పాలనపై నేను కాంగ్రెస్‌ నేతలతో చర్చకు సిద్దం. కాంగ్రెస్‌ నేతలకు ఆ దమ్ముందా?ముస్లింల రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ అంశాలపై మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? అని సవాలు విసిరారు.

సిఎం కెసిఆర్‌ ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, మజ్లీస్ పార్టీలు ఒక గూటి పక్షులే. హైదరాబాద్‌ నగరంలో ఐసిస్ సానుభూతిపరులు తిష్టవేసుకొని కూర్చోంటే పోలీసులు పాతబస్తీపై కన్నెత్తి చూడలేదు. చివరికి జాతీయ దర్యాప్తు బృందం నగరంలో ఐసిస్ సానుభూతిపరులున్నారని కనుగొని వారివద్ద నుంచి బారీగా ప్రేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకొంటే గానీ పోలీసులకు ఈ విషయం గురించి తెలియలేదు. మజ్లీస్, టిఆర్ఎస్‌ల స్నేహం కారణంగానే నగర పోలీసులు పాతబస్తీలో తనికీలు నిర్వహించలేకపోతున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదం కనబడినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే లభిస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ, కెసిఆర్ ఇద్దరూ ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. వారి అబద్దాలను ఇంకా నమ్మడానికి తెలంగాణా ప్రజలు సిద్దంగా లేరు,” అని విమర్శించారు.


Related Post