బిజెపి పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు?

August 14, 2018


img

ఈరోజుల్లో రాజకీయాల గురించి మీడియాలో వచ్చే వార్తలలో ఏవి నిజమో ఏవి ‘పెయిడ్ వార్తలో’ తెలియని పరిస్థితి కనిపిస్తోంది. మీడియాకు, రాజకీయపార్టీలకు, ప్రభుత్వాలకు మద్య ఉండాల్సిన సన్నటిగీత చెరిగిపోవడమే అందుకు కారణం. తాజాగా ఏబిపి-సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా సర్వే జరిపి ప్రకటించిన వివరాలు అటువంటి అనుమానాలే కలిగిస్తున్నాయి. 

బిజెపి పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ చేతిలో బిజెపి ఓడిపోతుందని సర్వేలో తేల్చి చెప్పింది. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బిజెపికి కాస్త ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది కానీ అవి అధికారంలోకి వచ్చేందుకు సరిపోకపోవచ్చునని తేల్చి చెప్పింది.

ఏబిపి-సీ ఓటర్ సర్వే వివరాలు: 

మధ్యప్రదేశ్: (మొత్తం సీట్లు 230) కాంగ్రెస్‌-117, బిజెపి-106, ఇతరులు-7 

ఛత్తీస్ ఘడ్: (మొత్తం సీట్లు 90) కాంగ్రెస్‌-54, బిజెపి-33, ఇతరులు-3     

రాజస్థాన్: (మొత్తం సీట్లు:200) కాంగ్రెస్‌-130, బిజెపి-57, ఇతరులు-13  

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలలో మళ్ళీ అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలగా ఉంది. అందుకోసం మోడీ, అమిత్ షాలు అప్పుడే వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నారు కూడా. సర్వేలో చెప్పినట్లు బిజెపికి గట్టి పట్టున్న ఆ మూడు రాష్ట్రాలలో బిజెపి ఓడిపోతే మోడీ సర్కార్ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమే. కనుక ఎట్టిపరిస్థితులలో తన చేతిలో ఉన్న ఆ మూడు రాష్ట్రాలను బిజెపి చేజార్చుకోదు. కానీ సర్వే ఫలితాలు బిజెపి ఓటమి ఖాయం అని చెపుతున్నాయి. చిరకాలంగా ఆ మూడు రాష్ట్రాలలో బిజెపి పాలన కొనసాగుతోంది కనుక బిజెపి ప్రభుత్వాల పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉండటం సహజం. ప్రజల నెలకొన్న ఆ అసంతృప్తిని ఏవిధంగా చల్లార్చాలో ప్రధాని మోడీకి, అమిత్ షాకు బాగా తెలుసు. కనుక ఈ సర్వే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయో ఎన్నికలు దగ్గరపడితే కానీ తెలియదు.


Related Post