తెలంగాణా ప్రజలకు రాహుల్ ఏమి చెపుతారు?

August 13, 2018


img

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్‌ పర్యటనకు వస్తుండటంతో కాంగ్రెస్-టిఆర్ఎస్ నేతల మద్య మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో సమావేశం అయ్యేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంపై టి-కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేయగా, ఉస్మానియాలో రాహుల్ గాంధీని అనుమతించకపోవడం యూనివర్సిటీకి సంబందించిన వ్యవహారమని దానితో ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని, కానీ కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై బురద జల్లుతూ దుకు నీచరాజకీయాలు చేస్తున్నారని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతల విమర్శలను త్రిప్పి కొట్టారు.

రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన రాహుల్ గాంధీకి అనేక ప్రశ్నలు సంధించారు. 

1. అమరవీరులకు రాహుల్ గాంధీ శ్రద్దాంజలి ఘటిస్తారని చెప్పారు. వారి మరణాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేసినందునే అంతమంది బలిదానాలు చేసుకొన్న మాట వాస్తవం అవునా..కాదా?      

2. పదేళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పగలరా?

3. రాష్ట్రంలో సమస్యలున్నాయని టి-కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో సమస్యలు పరిష్కరించి ఉండి ఉంటే నేడు సమస్యలు ఉండేవి కావు కదా? 

4. పదేళ్లపాటు కేంద్రంలోను, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో ఎన్ని కిమీ జాతీయరహదారులు వేసిందో చెప్పగలరా? జాతీయరహదారులను నిర్మించడంలో ఒకప్పుడు దేశంలో అన్నీ రాష్ట్రాల కంటే వెనుకబడిన తెలంగాణా ఇప్పుడు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న సంగతి మీకు తెలియదా?

5. రాష్ట్రంలోని వ్యాపారవేత్తలతో, పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశమైనప్పుడు వారికి ఏమి చెపుతారు? పొరుగు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇస్తున్నాము. దాని వలన మీకు నష్టం వస్తే భరించండి అని చెపుతారా?

6. తెలంగాణాపై అకస్మాత్తుగా ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణా నేతలకు ఎందుకు స్థానం కల్పించలేదు?

7. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతులు పంటరుణాల కోసం, విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే రైతుల చుట్టూ తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తో వారి సంక్షేమం కోసం పాటుపడుతుండటం మీకు కనబడటం లేదా?         

టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే వచ్చే ఎన్నికలలో మళ్ళీ టిఆర్ఎస్ ను గెలిపిస్తాయి. తెలంగాణాకు కెసిఆరే శ్రీరామరక్ష. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమ ప్రజలు కూడా మావైపే ఉన్నారని గ్రేటర్ ఎన్నికలలోనే నిరూపించారు. కనుక రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించినంత మాత్రన్న మాపార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన హైదరాబాద్‌లో పర్యటిస్తే మాకెటువంటి అభ్యంతరాలు లేవు. ఉండవు,” అని అన్నారు మంత్రి హరీష్ రావు. 


Related Post