తెరాస బిసి నేతలు ఆ సభలో పాల్గొంటారా?

July 19, 2018


img

సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కులసంఘాలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ పార్టీలకు తమశక్తిని ప్రదర్శిస్తుంటాయి. తద్వారా సదరు కులానికి చెందిన నేతలకు తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాలనే సందేశం పార్టీలకు పంపుతుంటాయి. దీనినే మరోవిధంగా చెప్పుకోదలిస్తే టికెట్ ఆశిస్తున్న నేతలు తమ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు కులసంఘాల చేత ఇటువంటి సభలు పెట్టిస్తుంటారని చెప్పవచ్చు. మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక ఆ హడావుడి మొదలయింది. 

రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. సిపిఎం నేతృత్వంలో ఏర్పాటైన బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఈ వాదనను తెరపైకి తీసుకువచ్చి బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో తమ కూటమి బిసిలకే పెద్దపీట వేస్తుందని బిఎల్ఎఫ్ నేతలు పదేపదే చెపుతున్నారు. ఇది అధికార తెరాస, కాంగ్రెస్ లతో సహా అన్నిపార్టీలపై ఒత్తిడి పెంచడం ఖాయం. 

ఆ ఒత్తిడిని మరింత పెంచేందుకు జూలై 26వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీసిల సింహగర్జన జాతీయ సదస్సు జరుగబోతోంది. మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ దీనికి ముఖ్య అతిధిగా హాజరవుతారు. తెలంగాణా రాష్ట్రంలోని బిసి నేతలు ఆర్.కృష్ణయ్య, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, దేవేందర్ గౌడ్, బిఎల్ఎఫ్ నేతలు తదితరులు హాజరవుతారు. తెరాసలో కూడా అనేకమంది బిసి నేతలున్నప్పటికీ, ఇటువంటి సభలలో పాల్గొనడం ద్వారా తమ అధిష్టానం మీద టికెట్స్ కోసం ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కనుక తెరాస నుంచి బహుశః ఎవరూ ఈ సభకు ఎవరూ హాజరుకాకపోవచ్చు. కానీ తెరాసపై ఈ సభ ప్రభావం ఏమైనా ఉంటుందో లేదో చూడాలి. ఈ సభ కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఆశిస్తున్న నేతలకు ఎక్కువగా ఉపయోగపడవచ్చు.


Related Post