కాంగ్రెస్-తెరాస రెండుస్తంభాలాట!

July 16, 2018


img

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీల, వాటిలో నేతల హడావుడి కూడా పెరుగుతోంది. అలాగే పార్టీ ఫిరాయింపులు కూడా. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని భావింపబడుతున్న నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు తెరాసలో చేరిపోయారు. ఇప్పుడు తెరాస వంతు వచ్చినట్లుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు మండలంలో పారుపల్లి గ్రామానికి చెందిన కొందరు తెరాస కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరితే అభివృద్ధిలో పాలుపంచుకోవడం కోసం చేరినట్లు చెప్పుకొంటారు. అదే తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఎటువంటి అభివృద్ధిపనులు చేయకుండా మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపుచ్చుతునందుకు లేదా కెసిఆర్ నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడలను వ్యతిరేకిస్తూ తెరాసను వీడినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. ఈరోజు తెరాస కార్యకర్తలను పార్టీలో చేర్చుకొన్నప్పుడు డిసిసి అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్ అదే అన్నారు. అయితే పార్టీలు మారడానికి వారు చెప్పే కారణాలను ఎవరూ నమ్మరని వారికి కూడా తెలుసు. స్థానిక రాజకీయాలు, అవసరాలు, ఒత్తిళ్ళు, పదవులు, టికెట్స్ వగైరాల కోసమే మారుతారని ప్రజలకు తెలుసు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కప్పగంతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్-తెరాసలే ప్రధానంగా కనిపిస్తున్నాయి ఆ రెండు పార్టీల మద్యనే ఈ ఆట కొనసాగుతోంది. 


Related Post