రాజకీయ సన్యాసం క్యాన్సిల్

July 11, 2018


img

రామగుండం తెరాస ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం చేయాలనే ఆలోచనను విరమించుకొన్నట్లు ప్రకటించారు. మంత్రి కేటిఆర్ అయనతో మాట్లాడి నచ్చజెప్పిన తరువాత అయన తన మనసు మార్చుకొన్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అస్త్ర సన్యాసం చేయడం సరికాదని, రాష్ట్రంలో తెరాసను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఇంకా అవసరమైన అస్త్రశస్త్రాలను అన్నిటిని సమకూర్చుకొని అందరూ కలిసికట్టుగా పోరాడాలని సిఎం కెసిఆర్ కోరారని సోమారపు సత్యనారాయణకు మంత్రి కేటిఆర్ నచ్చచెప్పడంతో అయన మెత్తబడ్డారు. అనంతరం మంత్రి కేటిఆర్ తో కలిసి తెలంగాణా భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడారు. 

“నా కార్పొరేటర్లే నా మాట వినడం లేదనే బాధతోనే నేను రాజకీయ సన్యాసం చేయాలని భావించాను. కానీ కేటిఆర్ గారు నా సందేహాలన్నీ నివృతి చేసి నాకు గొప్ప భరోసా ఇచ్చారు. కనుక నా ఆలోచనను విరమించుకొంటున్నాను. సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధిని ఒక తపస్సులాగ భావించి పనిచేసుకుపోతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయనకు సహకరించవలసిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పటి వరకు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం నేను ఏవిధంగా నిబద్దతతో పనిచేశానో ఇకపై కూడా అదేవిధంగా పనిచేస్తాను. వచ్చే ఎన్నికలలో తెరాస గెలిపించుకొనేందుకు నావంతు కృషి నేను చేస్తాను,” అని చెప్పారు.


Related Post