దానం రాజీనామా..ఉత్తంకు డిల్లీ పిలుపు

June 23, 2018


img

దానం నాగేందర్ రాజీనామా చేసిన కొన్ని గంటలలోపే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అత్యవసరంగా డిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపురావడం విశేషం. దానం ఇదివరకే ఒకటి రెండుసార్లు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు కనుక మళ్ళీ కొత్తగా కారణాలు అడగవలసిన అవసరం లేదు. కానీ రాజీనామా చేశాక ‘ఒక కులం చేతిలో కాంగ్రెస్ పార్టీ నలిగిపోతోందని’ అయన చేసిన విమర్శల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో బిసిలకు సముచిత గౌరవం లభించడం లేదనే అయన వాదన ప్రజలలోకి వెళితే పార్టీకి చాలా నష్టం కలిగే ప్రమాదం ఉంది కనుక త్వరలో ఏర్పాటు చేయబోతున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా మార్పులు చేర్పులు చేయవచ్చు. 

కొందరు టి-కాంగ్రెస్ నేతలు ఇటీవల డిల్లీ వెళ్ళి తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పిర్యాదులు చేసినట్లు వార్తలు వచ్చాయి. కనుక వాటి గురించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాహుల్ గాంధీ సంజాయిషీ కోరవచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవిలో నుంచి తప్పిస్తే మళ్ళీ పార్టీలో అలకలు, అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అందుకు సిద్దపడి ఆయనను స్థానంలో మరొకరిని నియమించినా ఆ వచ్చే వ్యక్తి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం ఉండదు కనుక అటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీ పర్యటన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండవచ్చు.


Related Post