ఒక కులం చేతిలో టి-కాంగ్రెస్ చిక్కుకుపోయింది: దానం

June 23, 2018


img

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఒక కులస్థుల చేతిలో బందీ అయిపోయింది. రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బిసిలకు పార్టీలో ఎటువంటి గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదు. డి.శ్రీనివాస్, కేశవరావు వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటానికి అదే కారణం. మాజీ ఎంపి వి. హనుమంతరావు కూడా పార్టీలో చాలా ఇబ్బందిపడుతున్నారు. కానీ ఆ విషయం ఆయన పైకి చెప్పలేకపోతున్నారు. ఇక పొన్నాల లక్ష్మయ్యను పార్టీలో పట్టించుకునేవారే లేరు. పార్టీలో బిసిలకు ప్రాధాన్యత లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి? 

ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే పార్టీని నడిపిస్తున్నారు. నిజానికి ఇప్పుడు టి-కాంగ్రెస్ పార్టీకి ఒక వైఎస్ఆర్, కెసిఆర్ వంటి బలమైన నాయకులు కావాలి. కెసిఆర్ ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో బిసిలకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తున్నారు. అలాగే అన్ని కులాలు, మతాల ప్రజల సంక్షేమం కోసం అనేక పధకాలు అమలుచేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బిసిలను ఎందుకు పట్టించుకోవడం లేదు?

పార్టీని బలోపేతం చేయడానికి నేను మా అధిష్టానానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చాను. కానీ వాటిని పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికలకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించమని కోరాను. కానీ అంత ధైర్యం చేయలేకపోతోంది. టి-కాంగ్రెస్ పార్టీ ఒకే కులానికి చెందిన కొందరు నేతల చేతిలో బందీగా చిక్కుకుపోయింది. వారి చేతిలో పార్టీ ఉన్నంత కాలం అది మెల్లమెల్లగా పతనం అవుతూనే ఉంటుంది. పార్టీని గబ్బిలాలగ పట్టుకొని వ్రేలాడుతూ మెల్లమెల్లగా నాశనం చేస్తున్న అటువంటి నేతలను వదిలించుకొనే ప్రయత్నం చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుంది. 

నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదనే నేను పార్టీని వీడుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి నేను పార్టీలో పదవిలో ఉన్నప్పుడే తెరాస నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ అప్పుడు చేరితే మరిన్ని విమర్శలు భరించాల్సి వస్తుందని వెనకడుగు వేశాను. త్వరలోనే నేను తెరాసలో చేరబోతున్నాను. తెరాసలో చేరేందుకు నాకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు. ఒక సామాన్యకార్యకర్తగా పనిచేసేందుకు తెరాసలో చేరుతున్నాను. ఎప్పుడు చేరుతానో త్వరలోనే ప్రకటిస్తాను,” అని చెప్పారు.


Related Post