విజయశాంతి పర్యటనకు వస్తున్నారహో!

June 16, 2018


img

తెరాసలో ఉన్నప్పుడు విజయశాంతి చాలా చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ నిత్యం మీడియా వార్తలలో కనిపిస్తుండేవారు. గత ఎన్నికలకు ముందు ఆమె కెసిఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఆ కారణంగా ఆమె ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేదా? రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆమె నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, త్వరలోనే మళ్ళీ మెదక్ జిల్లా ప్రజల మధ్యకు వస్తారని పిసిసి కార్యదర్శి సుప్రభాత చౌదరి మీడియాకు తెలియజేశారు. 

శుక్రవారం మెదక్ జిల్లాలోని హావేలీఘణపూర్ మండలంలోని తొగిట గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా మాజీ ఎంపి విజయశాంతి త్వరలోనే మెదక్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పధకాల గురించి తెరాస గొప్పగా ప్రచారం చేసుకొంటోంది కానీ అవి అర్హులైన పేద ప్రజలకు కాక భూస్వాములు, తెరాస నేతలకే దక్కుతున్నాయని ఆరోపించారు. సబ్సీడీ ట్రాక్టర్లు, రైతుబంధు చెక్కులు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చునని చౌదరి అన్నారు. భూస్వాములకు పంటపెట్టుబడిగా లక్షల రూపాయలు అందిస్తున్న తెరాస సర్కార్ కౌలు రైతులకు రూ.4,000 ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతోందని చౌదరి ప్రశ్నించారు. ఈ పంచాయితీ ఎన్నికలలో తెలంగాణా ప్రజలు తెరాసకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు.

తెరాస సర్కార్ పై సుప్రభాత చౌదరి విమర్శలను పక్కనపెడితే, పంచాయితీ ఎన్నికల ప్రచారంతో విజయశాంతి మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారని స్పష్టం అవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆమె పోటీ చేయాలనుకున్నట్లయితే అందుకు ఈ పంచాయితీ ఎన్నికలతో ప్రజల మధ్యకు రావాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఎన్నికలలో గెలిస్తేనే ప్రజల మద్య తిరుగుతూ వారి సమస్యల గురించి మాట్లాడుతాను...లేకపోతే మళ్ళీ ఎన్నికల వరకు ప్రజల కోసం పనిచేయనవసరం లేదు...అన్నట్లు వ్యవహరించడం మంచి రాజకీయనేత లక్షణం కాదు. అటువంటివారు ఎన్నేళ్ళు రాజకీయాలలో ఉన్నా రాణించలేరు. ప్రజల ఆదరణ పొందలేరు.


Related Post