ఉద్యమబాట పట్టనున్న కౌలురైతులు

June 15, 2018


img

తెలంగాణా కౌలురైతులు ఉద్యమబాట పట్టేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. వారు వ్యవసాయం చేస్తున్నప్పటికీ స్వంతభూమి లేకపోవడంతో వారికి ఏ ప్రభుత్వ పధకాలకు అర్హులు కాలేకపొతున్నారు. నిజానికి భూమి ఉన్న రైతులకంటే కౌలురైతులకే ప్రభుత్వం సహాయసహకారాలు ఎక్కువ అవసరం. కానీ ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడమే లేదు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేకచర్యలు చేపడుతున్నప్పటికీ అవేవీ కౌలురైతులకు వర్తింపజేయకపోవడంతో వారు నానా కష్టాలు పడుతున్నారు. కనుక వారు వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి అప్పులపాలై చివరికి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఈ నాలుగేళ్ళలో 3,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోకుండా బడాభూస్వాములకు పంటపెట్టుబడిగా లక్షల రూపాయలు పంచిపెట్టడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. 

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆలంపూర్ తహసిల్దార్ కార్యాలయం ముందు సుమారు 100 మంది కౌలురైతులు గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ, “పంట పెట్టుబడి, జీవిత భీమా పధకాలను కౌలురైతులకు ఇవ్వకుండా భూస్వాములకు ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ కౌలురైతులు పట్ల ప్రభుత్వం ఇదేవిధంగా వివక్ష చూపుతున్నట్లయితే త్వరలోనే మహారాష్ట్రలో రైతుల మాదిరిగా తెలంగాణాలో నలుమూలల నుంచి హైదరాబాద్ కు కౌలురైతులతో లాంగ్ మార్చ్ నిర్వహించి నిరసన తెలుపుతాము. ముందుగా ఈ నెల 25,26,27 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించి నిరసనలు తెలుపుతాము. అప్పటికీ ప్రభుత్వం కౌలురైతులు సమస్యలను పరిష్కరించకపోతే హైదరాబాద్ కు లాంగ్ మార్చ్ నిర్వహిస్తాము,” అని హెచ్చరించారు. 


Related Post