ఇప్పుడు కుమారస్వామి వంతు

May 25, 2018


img

భాజపా నేత ఎడ్యూరప్ప ఎంత హడావుడిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారో అంతే వేగంగా కుర్చీలో నుంచి దిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ్ళ అయన బలనిరూపణ చేసుకోవలసి ఉంది. కాంగ్రెస్ (78), జెడిఎస్ (36) కలిపి మొత్తం 114 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం శాసనసభలో 221 మంది సభ్యులున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు 111 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్-జెడిఎస్ కూటమికి 114 మంది ఎమ్మెల్యేలున్నారు కనుక బలపరీక్షలో నెగ్గడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుపై కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఆధారపడి ఉంది. అది నిలబడాలన్నా, పడిపోవాలన్నా ముగ్గురు ఎమ్మెల్యేలు చాలు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు అలిగారు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రిపదవులు లభించనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనుక నేడు జరిగే బలపరీక్షలో వారు కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే కుమారస్వామి కూడా మళ్ళీ దిగిపోవలసి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితిరాకుండా నివారించేందుకు గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగిస్తోంది. ప్రభుత్వం నిలబడి అధికారంలో ఉంటేనే అందరికీ మేలు కలుగుతుంది లేకుంటే అందరూ నష్టపోతారని అందరికీ తెలుసు. కనుక వారు సర్దుకుపోవచ్చు లేదా భాజపా వలలో చిక్కినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందో లేదో తెలుసుకోవాలంటే ఈరోజు మధ్యాహ్నం 12.15గంటల వరకు వేచి చూడాల్సిందే. 

కర్ణాటక శాసనసభలో వివిధ పార్టీల బలాబలాలు ఈవిధంగా ఉన్నాయి: 

కాంగ్రెస్ పార్టీ: 78, జెడిఎస్: 36, భాజపా:104, బి.ఎస్.పి:01, ఇతరులు: 02


Related Post