ఆ వ్యవస్థను తెరాస సర్కార్ ద్వంసం చేస్తోంది: మల్లు

May 22, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెరాస సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం ఖమ్మం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ పంచాయితీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఫైనాన్స్ కమీషన్ నుంచి వాటికే నేరుగా నిధులు అందేలా చేస్తే, తెరాస సర్కార్ పంచాయితీల అధికారాలను, వాటి నిధులను తన గుప్పెట్లో పెట్టుకొని ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. గ్రామాలలో ఏ అభివృద్ధి పనులుచేయాలన్నా తెరాస సర్కార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన పరిస్థితి నెలకొనిఉంది. మన ఊరు మన ప్రణాళిక, గ్రామజ్యోతి అంటూ తెరాస సర్కార్ చేసిన హడావుడి కాగిహలకే పరిమితమైంది తప్ప ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో సర్పంచ్ లు, మండలాలలో జెడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి.లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు,” అని మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.

మల్లు భట్టి విక్రమార్క విమర్శలు వినడానికి చాలా చేదుగా ఉన్నప్పటికీ వాటిలో ఎంతో కొంత వాస్తవం ఉందని చెప్పక తప్పదు. ఉదాహరణకు చేవెళ్ళ తెరాస జెడ్.పి.టి.సి.సభ్యురాలు సిహెచ్.శైలజ ఎన్నికల సందర్భంగా తమ మండలంలో అనేక అభివృద్ధిపనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి బారీ మెజార్టీతో విజయం సాధింకాహరు. కానీ నాలుగేళ్ళు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజలకు ఇచ్చిన తన హామీలను నిలబెట్టుకోవడానికి ఆమె తన భూమిని అమ్మకానికి పెట్టారు. మల్లు ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏముంటుంది?



Related Post