టిటిడికి ఇది తగునా?

May 16, 2018


img

కొత్తగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకొంది. తిరుమల ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నవారిలో 65 ఏళ్ళు వయసుపైబడినవారిని తక్షణమే తొలగిస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. దాని ప్రకారం తిరుమల శ్రీవారి ప్రధానఅర్చకుడు రమణ దీక్షితులు, సీనియర్ అర్చకులు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు ఆలయసేవలనుంచి తక్షణం తొలగించబడ్డారు.  

వారి స్థానంలో గొల్లపల్లి వంశానికి చెందిన వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశానికి చెందిన కృష్ణ శేషాద్రి దీక్షితులు, పెద్దపాటి వంశానికి చెందిన శ్రీనివాస దీక్షితులను ప్రధానఅర్చకులుగా టిటిడి నియమించింది. 

టిటిడి నిర్ణయంపై రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకవ్యవస్థలో వేలుపెట్టే అధికారం టిటిడి బోర్డుకు లేదన్నారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న నిత్యపూజలు, దూపదీప నైవేద్యాలు ఆగమ శాస్త్రప్రకారం జరుగడంలేదని తాను అసంతృప్తి వ్యక్తం చేసినందునే టిటిడి కక్షపూరితంగా ఈచర్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. 

రమణ దీక్షితులతో సహా మిగిలిన నలుగురు చిరకాలంగా శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నారు. ప్రతీవ్యక్తి ఏదో ఒక సమయంలో పదవీ విరమణ చేయక తప్పదు కనుక వారూ పదవీ విరమణ చేయక తప్పదు. అయితే ఇప్పటి వరకు తితిడిలో ఇటువంటి నియమం లేనందున టిటిడి నిర్ణయం వివాదాస్పదమైంది.

ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి లేదా కార్మికుడు రిటైర్ అవుతున్నప్పుడు సాటి ఉద్యోగులు, అధికారులు వారిని ఘనంగా సన్మానించి, ఆత్మీయంగా వీడ్కోలు పలికి సాగనంపుతారు. కానీ అనేక ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో సేవలు చేస్తున్న ప్రధాన అర్చకులను హటాత్తుగా తొలగించడం వారికీ, టిటిడికి కూడా గౌరవప్రదం కాదు. కనుక ఈ విషయం గురించి వారికి ముందుగా తెలియజేసి, వారికి మరికొంత సమయం ఇచ్చి వారు గౌరవప్రదంగా పదవీ విరామణ చేసేందుకు అవకాశం కల్పించి ఉంటే అందరికీ హుందాగా, గౌరవంగా ఉండేది. 

కానీ ఆలయంలో జరుగుతున్న లోపాలను రమణదీక్షితులు ఎత్తిచూపినందుకే టిటిడి ఈవిధంగా వారిపై కక్షకట్టినట్లు వ్యవహరించడం సరికాదనే చెప్పాలి.  తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్తుల విషయంలో ఇంతకంటే పెద్ద వివాదమే జరిగింది కానీ వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించే విషయంలో టిటిడి ఇంత తొందరపాటు ప్రదర్శించలేదు.వారిపట్ల ఇంత కటినంగా వ్యవహరించలేదు.

ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రి వంటివారు రాజకీయ నాయకులతో తమకున్న పలుకుబడిని ఉపయోగించి లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి ఏదో ఒక పదవిలో కొనసాగుతున్నా టిటిడి పాలకమండలి వారిని ఏమీ చేయలేపోయింది. కానీ ఎప్పుడూ ఎంతో హుందాగా వ్యవహరిస్తూ వివాదాలకు, మీడియాకు దూరంగా ఉంటూ ఎప్పుడూ శ్రీవారి సేవలకే పరిమితమయిన రమణదీక్షితులు, మిగిలిన అర్చకుల పట్ల టిటిడి ఇంత అగౌరవంగా వ్యవహరించడం, ఈవిధంగా వారిని హటాత్తుగా బయటకు పొమ్మనడం సరికాదు. ఒకవేళ వారు నలుగురు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మళ్ళీ తమ ఉద్యోగాలను దక్కించుకొంటే అప్పుడు పోయేది టిటిడి పరువేనని గ్రహిస్తే మంచిది. కనుక ఇంతకాలం స్వామివారికి విశేషసేవలు చేసిన ఆ నలుగురు అర్చకులను సగౌరవంగా తప్పుకొనేందుకు అవకాశం ఇవ్వడం మంచిది. Related Post