మెట్రో ప్రయాణికుల సంఖ్య అంతేనా?

April 19, 2018


img

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూపులు చూసిన హైదరాబాద్ వాసులు, ఇప్పుడు మెట్రో రైల్ ఎక్కడానికి సందేహిస్తున్నారా? అంటే మెట్రో ఎండి సమాధానం వింటే అవుననే అనిపిస్తుంది. మెట్రో ప్రారంభమైన కొత్తలో రోజుకు కనీసం లక్షమంది ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు రోజుకు 60,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి స్వయంగా గురువారం మీడియాకు చెప్పారు. 

ఇది ఇక్కడితో ఆగితే పరువాలేదు కానీ ప్రయాణికుల సంఖ్య ఇంకా తగ్గితే మాత్రం మెట్రో ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. దీనికి అనేక కారణాలు కనబడుతున్నాయి. టికెట్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం. ఇంతవరకు మంత్లీ పాసులు ప్రవేశపెట్టకపోవడం. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం. ఉన్నా మెట్రో టికెట్+పార్కింగ్ టికెట్+పెట్రోల్ ఛార్జీలు కలుపుకొని చూస్తే మెట్రో ప్రయాణం ఖరీదుగా ఉండటం. మెట్రో రైళ్ళు నత్తనడకలు నడుస్తుండటం. మెట్రోతో పోలిస్తే ఆర్టీసిలో తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణించగలగడం. మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసి కనెక్టివిటీ సరిగాలేకపోవడం, ఆర్టీసీ బస్సులు, ఆటోలలో గమ్యస్థానాలకు అత్యంత సమీపం వరకు చేరుకొనే సౌలభ్యం ఉండటం...ఇంకా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 

ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలు ఏది చవుకగా, ఏది తమకు బాగా అందుబాటులో ఉంటే దానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. మెట్రో విషయంలో వారు ఊహించుకొన్నది ఒకటి జరుగుతున్నది మరొకటి. అందుకే హైదరాబాద్ వాసులు ఇతర రవాణా సాధనాలను ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారు. మెట్రో వచ్చిన తరువాత కూడా నగరంలో ఎక్కడా ట్రాఫిక్ తగ్గకపోవడమే అందుకు చక్కటి నిదర్శనం. అలాగే ద్విచక్రవాహనాల అమ్మకాలు కూడా నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కనుక హైదరాబాద్ మెట్రో సంస్థ చేతులు కాలక మునుపే జాగ్రత్తపడితే మంచిదేమో? 


Related Post