తీర్పు చెప్పిన వెంటనే పదవికి రాజీనామా!

April 16, 2018


img

మక్కా మసీదు పేలుళ్ళకేసుపై సోమవారం తుది తీర్పు చెప్పిన ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఆ కేసును చేపట్టగానే కేవలం రెండే రెండు నిమిషాలలో తీర్పు వెలువరించారు. అప్పటికే సిద్దంగా ఉంచుకొన్న తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తన రాజీనామా ఆమోదించడానికి సమయం అవసరమైతే అంతవరకు తనకు శలవు తీసుకొనేందుకు అనుమతించవలసిందిగా అభ్యర్ధించారు. 

ఈ విషయం గురించి ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడేప్రయత్నం చేయగా తన రాజీనామా ఆమోదం పొందిన తరువాతే మాట్లాడుతానని చెప్పడం విశేషం. 

మక్కా మసీదు కేసులో నిందితులు అందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో హిందూ సంస్థలతో సంబంధాలున్నాయనే సంగతి తెలిసిందే. కనుక వారిని కాపాడేందుకు కొన్ని రాజకీయశక్తులు న్యాయమూర్తిపై ఒత్తిళ్ళు తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ ఒత్తిళ్ళు భరించలేకనే న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తీర్పు చెప్పిన వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన రాజీనామా ఆమోదం పొందిన తరువాత ఎలాగూ ఆయనే అసలు విషయం ఏమిటో చెపుతానని అన్నారు కనుక అంతవరకు వేచి చూడాల్సిందే.


Related Post