ఉత్తర తెలంగాణాకు గజ్వేల్ కేంద్రంగా మారాలి: కెసిఆర్

January 18, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మెదక్, సిద్ధిపేట జిల్లాలలో తుఫ్రాన్, గజ్వేల్ పట్టణాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రెండు పట్టణాలలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. తుఫ్రాన్ లో కొత్తగా నిర్మితమైన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుఫ్రాన్ లో సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠధామం (శ్మశానవాటిక) నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముస్లింల ఖబర్ స్తాన్ (శ్మశానవాటిక)కు ప్రహారీగోడ నిర్మాణం కోసం రూ.15 లాఖలు మంజూరు చేశారు. పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ అదనంగా మరో 500 ఇళ్ళు నిర్మించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఆకర్షణీయమైన రంగులువేసి, కాలనీలో పచ్చదనం పెంచి మంచి మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని అధికారుఅలను కోరారు. నియోజకవర్గంలో ప్రతీ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో దానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. 

సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ పట్టణంలో నిర్మితమవుతున్న 100 పడకల ప్రభుత్వాసుపత్రిని సందర్శించినప్పుడు దానిపై మరో అంతస్తు నిర్మించి 150 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఆదేశించారు. ట్రామా సెంటర్ తో అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పరికరాలు సమకూర్చుకొని, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి ధీటుగా దానిని అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు అవసరమైన సిబ్బంది, నిధులు, సహాయసహకారాలు అన్నీ అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. గజ్వేల్ పట్టణంలో నిర్మితమవుతున్న ఈ ఆసుపత్రి ఉత్తర తెలంగాణా జిల్లాలైన సిద్ధిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాలకు సేవలు అందించే స్థాయిలో ఉండాలని కోరారు. 

గజ్వేల్ పట్టణంలో రూ.6.25 కోట్లు వ్యయంతో నిర్మితమవుతున్న వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించి అధికారులకు పలుసూచనలు చేశారు. మార్కెట్ ను కూడా సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరారు. మార్కెట్ వ్యర్ధాలు, మురుగునీరు తరలింపుకు ముందే అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. వచ్చే నెలలోగా ఈ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. 


Related Post