సిఎం కెసిఆర్ పై మహేష్ కత్తి విమర్శలు

January 17, 2018


img

సినీవిమర్శకుడు మహేష్ కత్తి సినిమా సమీక్షల ద్వారా పెద్దగా గుర్తింపు పొందలేకపోయినప్పటికీ, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా రాత్రికి రాత్రి మంచి పాపులర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ ఆ పాపులారిటీని మరింత పెంచుకొని మెల్లగా రాజకీయాలవైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా తాను దళితుడనని తెలియజేస్తూ ఆ వర్గం ప్రజలను ఆకట్టుకోవడానికి తన ముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకొంటున్నాడు. 

చంచల్ గూడా జైల్లో ఉన్న ఎం.ఆర్.పి.ఎస్ నేత మందకృష్ణ మాదిగను పరామర్శించడానికి గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వచ్చిన సంగతి తెలుసుకొని మహేష్ కత్తి కూడా పరామర్శకు వెళ్ళాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రంలో అప్రజాస్వామిక శక్తులు రాజ్యం ఏలుతున్నాయి. తెరాస సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేయడం తధ్యం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి నేను పూర్తి మద్దతునిస్తున్నాను,” అని అన్నారు. 

ఇంతవరకు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్న మహేష్ కత్తి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడం ద్వారా తన స్థాయి ఇంకా పెంచుకొందామని ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మహేష్ కత్తి, కెసిఆర్ ను విమర్శించడం ద్వారా తెలంగాణా ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటున్నాడు. పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం రాజకీయ అవగాహన లేదని వాదిస్తున్న మహేష్ కత్తి కూడా ఏమాత్రం రాజకీయ అవగాహన లేదని నిరూపించుకొంటున్నాడు. పవన్ కళ్యాణ్ సానుకూల దృక్పధంతో నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతుంటే, మహేష్ కత్తి ప్రముఖులపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ విద్వంసకర ధోరణిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. 


Related Post