హన్మంతన్న ఆరాటం దేనికో?

January 25, 2017


img

మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు వయసు ప్రస్తుతం 68సం.లు. రాజకీయాలలో నుంచి తప్పుకోవలసిన సమయం ఇది. ఆయన కంటే ఇంకా ఎక్కువ వయసున్నవారే రాజకీయాలలో ఉండి ఉండవచ్చు కానీ అంతవరకు కొనసాగినవారిలో చాలా మంది చివరిలో అవమానకరంగా నిష్క్రమించవలసి వచ్చిందనే సంగతి మరిచిపోకూడదు. అందుకు తాజా ఉదాహరణగా ములాయం సింగ్ యాదవ్ కనబడుతున్నారు. కానీ హనుమంతరావు మాత్రం ఇంకా చాలా కాలం రాజకీయాలలో కొనసాగాలనే ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నందున రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది కాంగ్రెస్ నేతలు తెరాస, తెదేపాలలోకి వెళ్ళిపోయారు. కానీ ఇంత వయసులో, ఇటువంటి వ్యతిరేక రాజకీయ పరిస్థితులలో కూడా హనుమంత రావు చాలా  చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుండటం గొప్ప విషయమే. దానికి బలమైన కారణమే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ సంపాదించుకోవాలన్నా లేదా మళ్ళీ రాజ్యసభ సీటు సాధించుకోవాలన్నా తను చాలా యాక్టివ్ గా ఉన్నట్లు అధిష్టానానికి నిరూపించుకోవలసి ఉంటుంది. లేకుంటే 70 ప్లస్ అని పక్కనపెట్టేసే ప్రమాదం ఉంటుంది. మరి ఆయన తాపత్రయాన్ని కాంగ్రెస్ అధిష్టాన దేవతలు గుర్తిస్తారో లేదో మున్ముందు తెలుస్తుంది.

బహుశః ఆ ప్రయత్నంలో బాగంగానే ఆయన నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, గవర్నర్ నరసింహన్ కి హెచ్చరికలు చేయడం మరో విశేషం. తెరాస సర్కార్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి, దాని నివేదిక మాత్రం ఇంతఃవరకు బయటపెట్టక పోవడాన్ని హనుమంత రావు తప్పుపట్టారు. కేసీఆర్ కి, గవర్నర్ నరసింహన్ ఇద్దరూ బీసి వ్యతిరేకులు కనుకనే ఆ నివేదిక బయటకు రాకుండా త్రొక్కిపట్టరని హనుమంత రావు ఆరోపించారు. అసలు దానిని అంత రహస్యంగా ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారుబీసిల సంక్షేమానికి తెరాస సర్కార్ ఒక సమగ్ర ప్రణాళికను తయారుచేయకుండా, వారిని కులాలువారిగా విభజించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని హనుమంత రావు విమర్శించారు.   నెలరోజుల్లోగా ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టకపోతే తను రాజ్ భవన్ ఎదుట నిరాహార దీక్షకు కూర్చొంటానని హనుమంత రావు ఇద్దరినీ హెచ్చరించారు.

హనుమంత రావు బీసిల కోసమే ఆరాట పడుతున్నారా లేదా వారి పేరు చెప్పుకొని హడావుడి చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించాలని ఆరాటపడుతున్నారా? అనే అనుమానం కలిగితే తప్పు కాదు. 


Related Post