రాజకీయాలకు కాళేశ్వరంను బలి చేయొద్దు: తెరాస

July 15, 2019


img

రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి నాబార్డ్ 38వ వార్షికోత్సవ వేడుకలలో ప్రసంగిస్తూ, “ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు మన దేశానికే గర్వకారణం. దానిద్వారా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. తద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 46,000 చెరువులకు నీళ్ళు అందుతాయి. తద్వారా ఆయా ప్రాంతాలలో భూగర్భజలాలు పెరుగుతాయి. పచ్చదనం పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మన దేశానికి భారీ సంపద సృష్టించబోయే గొప్ప ప్రాజెక్టు. అటువంటి గొప్ప ప్రాజెక్టుకు రాజకీయ కారణాలతో నిధులు అందించకపోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు అందించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.           

ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యవిలువలు నెలకొని ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన సాగునీటి ప్రాజెక్టులు దశబ్ధాల తరబడి నిర్మాణాలు జరుగుతుండేవి. ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అభివృద్ధి సాధించాలనే పూర్తి స్పృహ, చైతన్యం వచ్చినప్పటికీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పినట్లుగా నిధుల కేటాయింపులకు రాజకీయ కారణాలు అవరోదంగా మారుతున్నాయి. 

రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తున్నామని, లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇస్తున్నామని బిజెపి నేతలు చెప్పుకొంటుంటే, రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటిప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం చిల్లిగవ్వ విదిలించడంలేదని తెరాస నేతలు వాదిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నట్లే, రాష్ట్ర ప్రభుత్వం కూడా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెరాసలో చేరుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరుతున్నామని చెప్పుకోవడం ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చుతోంది. కనుక నియోజకవర్గం స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు రాజకీయ కారణాలే అభివృద్ధికి ప్రదాన అవరోధంగా మారినట్లు స్పష్టమవుతోంది. 

ఇప్పుడు అన్ని పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కనుక తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం చాలా సంకుచితంగా వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి అవాంఛనీయపోకడల వలన అభివృద్ధి కుంటుపడుతుంది.


Related Post