ఆ గట్టునుంటావా నాగన్న...ఈ గట్టునుంటావా...

January 07, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఆ కారణంగా వారివురూ వివిద రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో వారిరువురి మద్య పోటీ ఏర్పడటంతో రంగస్థలం సినిమాలోని ‘ఆ గట్టునుంటావా నాగన్న...ఈ గట్టునుంటావా...’అనే పాట గుర్తుకొస్తోంది. 

ప్రాంతీయ పార్టీలలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్ (జమ్ము కశ్మీర్), డీఎంకె (తమిళనాడు) వంటి కొన్ని పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపనిచేయగా, కర్ణాటకలోని జెడిఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తోంది. కనుక దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బంధాలు కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. 

కనుక వాటిని తమవైపు తిప్పుకునేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీని ప్రధానమంత్రి చేయడం కోసమే సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ మిత్రపక్షలను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కనుక మిత్రపక్షాలు చేజారిపోకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 

సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు పోటీగా ఏపీ సిఎం చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలను అన్నిటినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలను అన్నిటినీ ఏకం చేసి కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో  భాగంగానే ఈరోజు సాయంత్రం చంద్రబాబునాయుడు డిల్లీ వెళుతున్నారు. 

ఈరోజు సాయంత్రం డిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రధాని దేవగౌడ, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అజిత్ సింగ్ తదితరులతో సమావేశమయ్యి కూటమి విధివిధానాల గురించి చర్చించనున్నారు. కేసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటుకు జై కొట్టిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. కనుక దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏ గట్టున ఉంటాయో మరో రెండు నెలలోపుగానే తేలిపోవచ్చు. 


Related Post