తెలంగాణాలో మరో ఫ్రంట్...బాబోయ్!

June 22, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్, ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణా జనసమితి హడావుడి చేస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయకూటమి ఆవిర్భవించబోతోంది. అది సిపిఐ నేతృత్వంలో ఏర్పాటు కాబోతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాస, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయవేదిక అవసరమని మేము భావిస్తున్నాము. కనుక జూలై నెలాఖరులోగా మా పార్టీ నేతృత్వంలో ఒక కూటమిని ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం టిజెఎస్, తెదేపా, ఎం.ఆర్.పి.ఎస్., బిసి సంఘాలు, వామపక్షాలతో చర్చలు సాగుతున్నాయి. వారిని కూడా మా కూటమిలో చేరవలసిందిగా కోరుతున్నాము. తెరాసను ఓడించాలంటే వామపక్షాల వల్ల కాదు. అందుకే అన్ని పార్టీలను కలుపుకుని ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. మాతో అన్ని పార్టీలు కలిసి వస్తాయనే భావిస్తున్నాము,” అని చెప్పారు. 

తమ కూటమి తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని చాడ వెంకట్ రెడ్డి చెప్పడం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నట్లుంది. లేకుంటే, కాంగ్రెస్, తెరాస, భాజపాలపై తమ ఫ్రంట్ పోరాడుతుందని చెప్పి ఉండేవారు. సిపిఎం ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ లో చేరడానికి నిరాకరించిన సిపిఐ, దానిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలను తమ కూటమిలో చేరాలని ఆశించడం విచిత్రంగా ఉంది. ఒకపరిమితికి మించి ఇటువంటి కూటములు, పార్టీలు ఏర్పాటయినట్లయితే, వాటిలో దేనికి ఓటేసినా వృధా అవుతుందనే భావనతో ప్రజలు ఏకపక్షంగా తెరాసకు ఓటేసి గెలిపించవచ్చు. 


Related Post