నష్టపరిహారానికి బదులుగా రైతులకు భీమా?

May 26, 2018


img

ఈ ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వమే జీవితభీమా చేయించబోతోంది. రైతు మరణిస్తే అతను లేదా ఆమె నామినీకి ఎల్.ఐ.సి. సంస్థ ఆ సొమ్మును 10 రోజులలోగా అందిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి ఆలోచనే అని చెప్పక తప్పదు. ఆర్ధికసమస్యల కారణంగా రాష్ట్రంలో  ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల నష్టపరిహారం అందిస్తోంది. ఇప్పుడు ఈ జీవితభీమా పధకం అమలులోకి వచ్చేక కూడా ప్రభుత్వం ఆ సొమ్మును అందిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

రైతుల ఆత్మహత్యలు చాలా సున్నితమైన విషయం కనుక దీనిపై ప్రభుత్వం తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటకు చెప్పలేకపోతోందని భావించవచ్చు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింసింహారెడ్డి మాట్లాడుతూ, “నిజానికి ఆత్మహత్యలు చేసుకున్నవారందరూ రైతులు కారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బారీ నష్టపరిహారానికి ఆశపడి రైతులు కానివారి పేర్లను, అలాగే వివిధ కారణాల చేత చనిపోయినవారి పేర్లను ఈ జాబితాలో చేర్చుతున్నారు. కానీ మీడియా, ప్రతిపక్షాలు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, వాటిని నివారించేందుకు మా ప్రభుత్వం ఏమీ చేయడంలేదని విమర్శిస్తున్నాయి,” అని అన్నారు. 

కనుక రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా చేయించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేగాక దేశంలో తొలసారిగా రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా చేయించిన ఘనత తెరాసకు లభిస్తుంది. దీంతో వచ్చే ఎన్నికలలో రైతులందరూ తెరాస వైపే మొగ్గుచూపుతారనె ఆలోచన కూడా ఇమిడి ఉన్నట్లు భావించవచ్చు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏవైనప్పటికీ రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా చేయించడం నిజంగా ఒక గొప్ప మానవతా దృక్పధంతో కూడిన ఆలోచన అని చెప్పవచ్చు. 


Related Post